సబిత,సునీతలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి
కేసీఆర్ చావు కోరడం సమంజసం కాదు: మాజీ వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: అసెంబ్లీ సమావేశాలకు నిరసనగా వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని బొంరాస్‌పేట్ మాజీ వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల పట్ల, అందులోనూ మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించాల్సిన విధానం ఇదేనా అని ప్రశ్నించారు. మహిళలకు గౌరవం ఇవ్వడం మన సంప్రదాయమని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదన్నారు.
సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిల పట్ల జరిగిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌ను ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ చావును కోరడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని శేరి నారాయణరెడ్డి విమర్శించారు. కేసీఆర్ లేకపోయి ఉంటే నేడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అని ప్రశ్నించారు. వ్యక్తిగత రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, రాజకీయ ప్రత్యర్థుల పట్ల కూడా కనీస గౌరవం పాటించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కేసీఆర్ జీవించి ఉన్నా, లేకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను చరిత్ర గుర్తుంచుకుంటుందని, ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానాన్ని ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, మహేందర్‌రెడ్డి, దుప్చర్ల గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, లచ్చప్ప, బురహన్‌పూర్ గ్రామ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మహేందర్, అనంత గౌడ్, సలీం పాషా, సలాం, రవి గౌడ్, ఆంజిలయ్య తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.