మెట్రో నగరాలకు ఆవల కూడా క్యాన్సర్ సంరక్షణ విస్తరించాలి
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
విదిశ: క్యాన్సర్ సంరక్షణ సేవలను కేవలం ప్రధాన మహానగరాలకే పరిమితం చేయకుండా చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డే-కేర్ క్యాన్సర్ కేంద్రాన్ని’ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లాలతో కలిసి ఆయన ప్రారంభించారు. పెరుగుతున్న క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు రోగులకు వారి స్వగ్రామాలకు సమీపంలోనే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అణుశక్తి విభాగం (డీఏఈ), టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) సాంకేతిక సహకారంతో విదిశ కేంద్రంలో దశలవారీగా క్యాన్సర్ సంరక్షణ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ముంబైలోని యాక్ట్రెక్ (ACTREC) ప్రాంగణంలో ప్రత్యేక ఆంకాలజీ శిక్షణ నిచ్చారు. విదిశా మెడికల్ కాలేజీలో అధునాతన రేడియోథెరపీ కేంద్రం (లీనియర్ యాక్సిలరేటర్) ఏర్పాటుతో పాటు, ముందస్తు క్యాన్సర్ గుర్తింపు కోసం ప్రత్యేక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్', క్యాన్సర్ రిజిస్ట్రీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.