పీఎం కిసాన్ నిధుల పెంపుపై కేంద్రం క్లారిటీ: ఆ వార్తల్లో నిజం ఎంత?
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-Kisan) పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు ఇస్తున్న వార్షిక ఆర్థిక సాయాన్ని రూ. 6,000 నుండి రూ. 10,000కు పెంచుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర అధికార వర్గాలు తేల్చిచెప్పాయి.
రైతులకు అందే పెట్టుబడి సాయాన్ని పెంచే అంశంపై ప్రభుత్వ పరిశీలనలో ఉందంటూ కొద్ది రోజులుగా కొన్ని వర్గాల నుంచి చర్చలు నడిచాయి. అయితే, దీనిపై వస్తున్న ఊహాగామాలకు చెక్ పెడుతూ పీఎం కిసాన్ అధికారిక యంత్రాంగం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి ఎలాంటి పెంపు నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే ప్రతి నాలుగు నెలలకొకసారి రూ. 2,000 చొప్పున ఏడాదికి రూ. 6,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్నకోట్లాది మంది అర్హులైన రైతులకు తదుపరి విడత నిధుల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. షెడ్యూల్ ప్రకారం రాబోయే అక్టోబర్ నెలలో ఈ తదుపరి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి సాంకేతిక అడ్డంకులు ఎదురుకాకుండా ఉండేందుకు రైతులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.