పూల సోయగాల నడుమ బతుకమ్మకు వీడ్కోలు
పూల పండగలో వెల్లివిరిసిన తెలంగాణ సంప్రదాయాలు.. కోలాటాలు, పాటలతో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు.. మహిళల సందడితో కళకళలాడిన చెరువుల పరిసరాలు
రంగారెడ్డి : తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఆశ్వయుజ అష్టమి సందర్భంగా జరుపుకునే సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పూల పండుగకు ముగింపు పలికారు. అక్టోబర్ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తయారు నుంచి వృద్ధుల వరకు చేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా సమీపంలోని చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల వద్దకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.
బతుకమ్మ పాటలు, కోలా టాలు, సంప్రదాయ నృత్యాలతో పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి. మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. పూల పండుగలో చిన్నారు ఉల్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణాన్ని నింపాయి. సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేస్తూ మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వి. శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్