యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో కలకలం
సూర్య క్రైమ్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిథారి హరిబాబు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్‌లోని ఆర్‌ఆర్ సెంటర్‌లో హరిబాబును గుర్తుతెలియని వ్యక్తి కొబ్బరికాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా నరికి ప్రాణాలు తీశాడు. ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు, ప్రస్తుతం జరిగిన హరిబాబు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి, చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా, భర్త హరిబాబే ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు.
అదనపు కట్నం కోసం హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులైన తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ సైతం వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే విషయమై మార్చి 16వ తేదీ రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో హరిబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో పరారీలో ఉన్న హరిబాబును కోరుట్ల శివారులో అరెస్ట్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు హత్యకు గురికావడంతో ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.