క్షణికావేశంలో భర్తను హతమార్చిన భార్య, కొడుకు!
సూర్య - మానకొండూర్ :మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు మంటగలిసిపోతున్నా యి. కలిసి నడుస్తానని ప్రమాణం చేసిన భార్యే, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే కాలయముడుగా మారిన దారుణ ఘటన మానకొండూరు మండలంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టుదుద్దేనపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. మానకొండూరు సిఐ పి. శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం... గట్టుదుద్దేనపల్లి గ్రామానికి చెందిన కప్ప రమేష్ (43), అతని భార్య సుమలత మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వివాదం రేగింది.
ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన భార్య సుమలత, వారి కుమారుడు ఇద్దరూ కలిసి రమేష్‌పై దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఉన్న ఇటుకపెళ్లలు, కర్రతో రమేష్ తలపై, ముఖంపై బలంగా, విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన రమేష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో వారు లొంగి పోయారు.ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న వెంటనే మానకొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీలత మాట్లాడుతూ... "గట్టుదుద్దేనపల్లి గ్రామంలో హత్య జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాము. మృతుడు రమేష్‌ను అతని భార్య సుమలత, కొడుకు కలిసి ఇటుకపెళ్లలతో, కర్రతో తలపై, ముఖంపై కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులపై చట్టప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటాము" అని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. కన్న తండ్రినే కొడుకు, భర్తను భార్య కలిసి అంతమొందించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.