రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సూర్య కరీంనగర్ ప్రతినిధి :
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ తిప్పాపూర్ గోశాలలో సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా జతల కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం ప్రారంభించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా జిల్లా స్థాయి కమిటీ అర్హులను ఎంపిక చేసి కోడెలను అందజేస్తున్నట్లు తెలిపారు.కోడెలను రైతులు బాధ్యతగా సంరక్షించాలని, అక్రమ తరలింపులకు పాల్పడితే చర్యలు తప్పవని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. భక్తులు పాలు మరవని చిన్న కోడెలు, జెర్సీ జాతి కోడెలను సమర్పించకుండా, ఆరోగ్యంగా ఎదిగిన దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని సూచించారు. వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో నిర్ణీత రుసుం చెల్లించి నిజ కోడెను సమర్పించే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.