అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.?
రోడ్డుకు ఇరువైపులా సమానంగా భూములు సేకరించాలి
సంకేపల్లి గూడ భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష.
రేడియల్ రోడ్డు ఎగ్జిట్ కు భూ సేకరణలో సంకేపల్లి గూడ గ్రామస్తులకు పూర్తి అన్యాయం అంటూ రైతుల నిరసన.
షాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 11)
రేడియల్ రోడ్డు 2 ఎగ్జిట్ నిర్మాణంలో సంకేపల్లి గూడ గ్రామస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆ గ్రామస్తులు ధ్వజమెత్తారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసనలు ఆగవని కోపగించారు. రోడ్డు నిర్మాణము, తమ ప్రాంతా అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు కానీ మా ఒక్క గ్రామానికి అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నామన్నారు. న్యాయం జరిగే వరకు నిరసనలు ఆపమని తెలిపారు.
రేడియల్ రోడ్డు-2 నిర్మాణం కొరకు ఓ ఆర్ ఆర్ నుండి కోస్గి వరకు గతంలోనే ప్రభుత్వం భూములను సేకరించింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎగ్జిట్ లు ఏర్పాటు చేయనున్నారు అక్కడ భూముల సేకరణ ప్రారంభించారు. అందులో భాగంగానే షాబాద్ మండలము సంకేపల్లి గూడ వద్ద ఎగ్జిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఎగ్జిట్ ఏర్పాటు చేస్తే చందన్ వెళ్లి , సీతారాంపూర్ గ్రామాలలో ఉన్న కంపెనీలకు రాకపోకలకు సులభము అవుతుందని ప్రభుత్వం ఆలోచించింది. దాని కొరకు 42.06 ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుంటుందని గజిట్ విడుదల చేశారు. దాని కొరకు ఏ ఏ సర్వే నెంబర్లు ఎంత పొలం పోతుందన్న విషయాన్ని ప్రకటనలు రూపంలో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. గత పది రోజుల క్రితం ఎక్కడి నుండి ఎక్కడి వరకు భూముల సేకరణ జరుగుతుందో సర్వే చేసి హద్దులకు సంబంధించిన గుర్తులు వేశారు. దానితో సంకెపల్లి గూడ గ్రామస్తులు తమకు అన్యాయం జరుగుతున్నదని గతంలో ఒకసారి స్థానిక తహసిల్దార్ అన్వర్ ను కలిశారు. ఆర్డిఓ పార్థసారధి రెడ్డి ని కూడా కలిశారు. ఎగ్జిట్ కొరకు భూమిని సేకరిస్తున్నప్పుడు రోడ్డుకు రెండు వైపులా సమానంగా భూమిని తీసుకొని రెండు వైపులకు వెళ్లే వాహనాలు వచ్చే వాహనాలు వెళ్లడానికి సర్కిల్ (వలయం) రూపంలో రోడ్లన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డుకు ఉత్తరం వైపుకు (చేవెళ్ల వైపు) తక్కువ భూమిని సేకరించి రోడ్డుకు దక్షిణం వైపు (సంకేపల్లి గూడవైపు) ఎక్కువ పొలాన్ని తీసుకుంటున్నారు. అంతేకాకుండా సగం గ్రామం రోడ్డులోకి వెళ్తున్నది. సగం గ్రామంలోని ఇల్లు పోతే మేము ఎక్కడ ఉండాలని ఇదెక్కడి న్యాయమంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. వారం రోజులైనా తమకు ఎలాంటి సమాధానం రాలేదని టెండర్లు పూర్తి అవుతున్నాయని భూములు ఇల్లు పోతే మాకు దిక్కవరని రిలే నిరాహార దీక్షకు దిగారు.
స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి గ్రామస్తులు అందరూ అలాగే చేరిగూడ గ్రామస్తులు కొందరు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. రెండు గంటల అనంతరం కంది ముంబాయి లింకు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి వారిని రోడ్డుపై నుంచి పంపించారు. దానితో వారు నేరుగా తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి కార్యాలయం ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఎగ్జిట్ అలైన్మెంట్ను సరిగ్గా చేయాలని రోడ్డుకు రెండు వైపులా సమానంగా భూములు సేకరించి రింగురోడ్డును వేయాలని భీష్మించుకు కూర్చున్నారు. రోడ్డుకు ఉత్తరం వైపు కొందరు బడా నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు ఉన్నందుననే సన్నాసిన్న కారు రైతుల భూములు లాక్కోవడానికి ఇళ్లను లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అలైన్మెంట్ను మార్చి తమకు న్యాయం చేయాలని బయటాయించారు. రోడ్డుకు రెండు వైపులా సమానంగా తీసుకుంటే అభివృద్ధిని మేము అడ్డుకోమని వారు తెలిపారు. దానితో తాసిల్దార్ అన్వర్ వచ్చి ఇలా కూర్చోవడం సరికాదని కార్యాలయాల ముందు ధర్నా చేయడం పద్ధతి కాదని వారిని ఓదార్చి వారి సమస్యలను ఒక్కొక్కరిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. భూములను సేకరించడం వరకే మా పని అని రోడ్డు అలైన్మెంట్ ఎగ్జిట్ (వలయము)లు ఎగ్జిట్ వద్ద ఎంత స్థలాన్ని సేకరించాలి ఏ విధంగా అక్కడ రోడ్లు నిర్మాణం చేయాలి అన్న విషయం హెచ్ఎండిఏ ఇంజనీరింగ్ విభాగానికి తెలుసునని రోడ్ల నిర్మాణము అలైన్మెంట్ పూర్తిగా ఇంజనీరింగ్ శాఖ చూసుకుంటుందని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే నివేదిక రూపంలో పంపిస్తానని అలాగే హెచ్ఎండిఏ అధికారులకు నివేదిక వెళుతుందని తెలిపారు. మంగళవారం వరకు మీకు పూర్తి నివేదిక తెలియజేస్తామని, రైతులకు పేదలకు అన్యాయం చేయమని వారికి హామీ ఇచ్చారు. మంగళ వారం వరకు ఓపిక పట్టండి అని తెలిపారు. దానితో రైతులు రెండు గ్రామాల ప్రజలు తాసిల్దారుపై నమ్మకం ఉంచి ధర్నా విరమించి వెళ్తున్నట్లు తెలిపారు.