యువత సంకల్పంతోనే 'వికసిత్ భారత్'
'ఫార్మ్-ఇన్నోవా అవార్డ్స్' కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అహ్మదాబాద్ (గుజరాత్): దేశ స్వాతంత్ర్య శతవార్షికోత్సవం నాటికి భారతదేశం ఎలా ఉండాలో నిర్దేశించే సంకల్పాన్ని యువత ఇప్పటి నుంచే తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన 'ఫార్మ్-ఇన్నోవా అవార్డ్స్-2026' ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఆలోచనను మూడు ముఖ్యమైన భాగాలుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1857 నుండి 1947 వరకు సాగిన స్వాతంత్ర్య పోరాట సమగ్ర చరిత్రను యువతరానికి తెలియజేయడం మొదటి భాగమైతే, 1947 నుండి 2022 వరకు భారత్ సాధించిన ప్రగతి, విజయాలను వివరించడం రెండవ భాగమని పేర్కొన్నారు. వీటిలో అత్యంత కీలకమైన మూడవ అంశం – 100 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకునే సమయానికి దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు యువత దృఢ సంకల్పం తీసుకోవడమేనని స్పష్టం చేశారు.