బెంగళూరు NLSIU వార్షిక స్నాతకోత్సవం రద్దు
విద్యార్థుల నిరసనే కారణమా?
బెంగళూరు: ప్రసిద్ధ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) తన 34వ వార్షిక స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమాన్ని సడన్‌గా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ యాజమాన్యం అధికారికంగా తెలిపినప్పటికీ, విద్యార్థుల నుంచి వ్యక్తమైన తీవ్ర నిరసనే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వర్సిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమవ్వడం, వివాదం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉండటంతో యాజమాన్యం స్నాతకోత్సవాన్ని వాయిదా వేయక తప్పలేదు.
"కొన్ని అనివార్య కారణాల వల్ల 34వ వార్షిక స్నాతకోత్సవాన్ని రద్దు చేస్తున్నాం" అని NLSIU ఓ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, అసలు కారణం విద్యార్థుల నిరసన కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన లా వర్సిటీ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.