సరిహద్దుల్లో ముందస్తు రాఖీ సంబరాలు
BSF జవాన్లకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
జమ్మూ (జమ్మూ-కశ్మీర్): రేపు (శుక్రవారం) జరగనున్న రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని జమ్మూ-కశ్మీర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద పండుగ వాతావరణం సంతరించుకుంది. సరిహద్దుల్లో అహరహం కాపలా కాసే సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లతో కలిసి స్థానిక పాఠశాల విద్యార్థినులు, గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు.
కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో ఉన్న BSF జవాన్లకు స్థానిక విద్యార్థినులు, గ్రామీణ మహిళలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. పండుగ వేళ తమకు అక్కచెల్లెళ్ల లోటు తెలియకుండా ఆప్యాయత చూపించిన విద్యార్థినులకు, గ్రామస్తులకు BSF అధికారులు, జవాన్లు ధన్యవాదాలు తెలిపారు.
సరిహద్దు రేఖ వద్ద జరిగిన ఈ కార్యక్రమం జవాన్లలో సరికొత్త ఉత్సాహాన్ని, దేశభక్తి భావనను నింపింది. దేశానికి రక్షణగా నిలిచే జవాన్లకు రక్షాబంధన్ వేడుకల సందర్భంగా స్థానికులు అండగా నిలవడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.