నేపాల్ వరద బాధితుల కోసం కాశీ దశశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, హారతి
వారణాసి (ఉత్తర ప్రదేశ్): ఇటీవల నేపాల్‌లో సంభవించిన భయాందోళనకర ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన బాధితుల కోసం ఆధ్యాత్మిక నగరం వారణాసిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర దశశ్వమేధ ఘాట్ వద్ద ప్రతిరోజూ అత్యంత వైభవంగా జరిగే గంగా హారతి సందర్భంగా వరద బాధితులకు ఉపశమనం కలగాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.
దశశ్వమేధ ఘాట్‌లోని పండితులు, స్థానిక ప్రజలు మరియు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు కలిసి నేపాల్‌లోని వరద బాధితుల కోసం గంగా మాతకు ప్రత్యేక హారతి నివేదించారు. ఆకస్మిక వరదల దాటికి ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం ఘాట్ వద్ద దీపాలు వెలిగించి, మౌనం పాటించి నివాళులర్పించారు. వరదల్లో చిక్కుకున్న వారు త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరాలని, బాధితులు ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ భక్తులు ప్రత్యేక వేడుకోలు చేపట్టారు.