నెదర్లాండ్స్‌లో వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి – ముగ్గురు మృతి
యామ్‌స్టర్‌డ్యామ్: ఐరోపా వ్యాప్తంగా వెస్ట్ నైల్ వైరస్ కేసులు పెరుగుతున్న వేళ, నెదర్లాండ్స్‌లో ఈ వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని వారాల వ్యవధిలో వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు నెదర్లాండ్స్ ప్రజారోగ్య సంస్థ (RIVM) గురువారం వెల్లడించింది.
2020 తర్వాత దేశంలో నమోదైన తొలి కేసును గుర్తించిన వారం రోజులకే మొదటి మరణం సంభవించగా, తాజాగా మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో నెదర్లాండ్స్‌లో మొత్తం కేసుల సంఖ్య 18కి చేరినట్లు RIVM పేర్కొంది.
ప్రధానంగా దోమల కాటు ద్వారా మనుషులకు వ్యాపించే ఈ వైరస్ వల్ల, ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి 150 మందిలో ఒకరికి తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ ఏడాది ఐరోపాలో రికార్డు స్థాయిలో వేడిగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో దోమల సంతతి పెరిగి వెస్ట్ నైల్ వైరస్ వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని WHO తెలిపింది. నెదర్లాండ్స్‌తో పాటు గ్రీస్, ఇటలీ దేశాల్లోనూ ఈ వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.