రూపాయికి భారీ ఎదురుదెబ్బ.. డాలర్‌తో మారకం విలువ 95.44కి పతనం
సూర్యా న్యూస్ డెస్క్
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ కరెన్సీ రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు రూపాయి మారకం విలువను దెబ్బతీశాయని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.
అంతర్జాతీయ ఆర్థిక రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారతీయ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా క్షీణించి 95.44 స్థాయికి పడిపోయింది. విదేశీ మారకద్రవ్య మార్కెట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, కరెన్సీ విలువ ఇంత భారీగా పడిపోవడం ఆర్థిక మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణల వాతావరణం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. ఈ పరిణామాల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ముడి చమురు దిగుమతుల కోసం భారత్ భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ధరలు పెరగడం వల్ల దేశీయంగా చమురు కొనుగోళ్ల భారం పెరిగి, అది నేరుగా కరెన్సీ విలువపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి వ్యయం పెరగడంతో పాటు విదేశీ సంస్థాగత మవెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి పతనానికి మరో కారణంగా నిలుస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు సంబంధిత వర్గాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల తీరు తెన్నులను బట్టి కరెన్సీ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.