అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
న్యూఢిల్లీ: భారతదేశ అటవీ, వృక్ష వనరుల మదింపు, పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. అదే సమయంలో స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను, అటవీ సిబ్బంది నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యూఢిల్లీలో పర్యావరణ, అటవీ శాఖ (MoEFCC) ఆధ్వర్యంలో 'అటవీ, వృక్ష వనరుల మదింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం' అనే అంశంపై గురువారం నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌ను కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర అటవీ శాఖల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొని అటవీ సరిహద్దుల డిజిటలైజేషన్, వృక్ష విస్తీర్ణ మదింపు, కార్బన్ నిల్వల అంచనా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి యాదవ్ మాట్లాడుతూ.. మానవులు ప్రకృతికి అతీతులు కారని, పర్యావరణంతో సహజీవనం చేస్తూ దాన్ని గౌరవించాలని సూచించారు. 2035 నాటికి 3.5–4.0 బిలియన్ టన్నుల కార్బన్ సింక్‌ను సృష్టించాలన్నది ఐక్యరాజ్యసమితి (UNFCCC) వేదికగా భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యమని, దీని సాధనకు సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) ప్రచురించే 'ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్' (ISFR) డేటా నాణ్యతను మరింత మెరుగుపరచాలని, క్షేత్రస్థాయి అనుభవాలను ప్రామాణిక కార్యాచరణ విధానంలో (SOP) పొందుపరచాలని సూచించారు.
అటవీ అగ్నిప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను (హాట్‌స్పాట్‌లను) ముందుగానే గుర్తించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే చిత్తడి నేలలు, అడవులు, గడ్డి భూముల మధ్య పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఇండియా మిషన్, మిష్టి, నగర వన్ యోజన, నమో వన్, ఏక్ పెడ్ మా కే నామ్ వంటి పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తోందని ఆయన వివరించారు. నష్టపరిహార అటవీకరణ అనేది కేవలం విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా మొక్కల పరిరక్షణ, పచ్చదనం నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా సాగాలని స్పష్టం చేశారు.