మూడు రోజుల పతనానికి బ్రేక్
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: వరుసగా మూడు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్లూ-చిప్ షేర్లలో ముగింపు సమయంలో జరిగిన కొనుగోళ్ళ మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. విపణి ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 138.36 పాయింట్లు (0.19%) పెరిగి 74,902.59 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 46.30 పాయింట్లు (0.20%) లాభపడి 23,477.80 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు బ్యారెల్‌కు 102.2 డాలర్ల మార్కును దాటి నమోదుకావడం మార్కెట్లో కొంత ఆందోళన కలిగించింది. సెన్సెక్స్ ప్యాక్‌లో పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టిపిసి, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టి లాభపడగా.. హెచ్‌సిఎల్ టెక్, టాటా స్టీల్, ట్రెంట్, ఐటిసి నష్టాలను చవిచూశాయి.
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో వచ్చిన ఎంపిక చేసిన కొనుగోళ్లు సూచీలకు కలిసివచ్చాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) బుధవారం రూ. 582.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు విపణి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.