ప్రధాని మోదీ పాతికేళ్ల పాలనపై ఏపీ కేబినెట్ ప్రశంసల తీర్మానం.
సూర్య అమరావతి బ్యూరో: రాజ్యాంగబద్ధ ప్రజాపాలనలో, ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా 25 సంవత్సరాల కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్, దేశాభివృద్ధిలో ప్రధాని మోదీ చూపిన దూరదృష్టి, నాయకత్వ పటిమను శ్లాఘిస్తూ ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి పాలనా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రధానిగా చేపట్టిన సంస్కరణలు భారతదేశ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేశాయని కేబినెట్ తీర్మానంలో కొనియాడింది. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన, సాంకేతిక విప్లవం (డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), భారీ మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ వేదికలపై భారత ప్రతిష్టను శిఖరాగ్రానికి చేర్చారని ప్రశంసించింది. సమర్థవంతమైన నాయకత్వంతో క్లిష్ట పరిస్థితులను అధిగమించి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తీరు ప్రజాస్వామ్య చరిత్రలోనే అపూర్వమని పేర్కొంది.
రాబోయే కాలంలో ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికతను సాకారం చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా కలిసి నడుస్తుందని మంత్రివర్గం స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, విభజన హామీల అమలుకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో దేశ సేవలో కొనసాగాలని ఏపీ కేబినెట్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించింది.