పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం: టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్
కల్పనా సెంటర్, టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ
పారిశ్రామికవేత్త గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
నంద్యాల అర్బన్:వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్టించి పూజించాలని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని కల్పనా సెంటర్ మరియు టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్ విగ్రహాల పంపిణీని ప్రారంభించి, స్థానిక ప్రజలకు, భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో చేసిన విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అన్నారు . మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూనే, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకువస్తూ, ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన పారిశ్రామికవేత్త గోళ్ళ రాజేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు గోళ్ళ రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ గారి ఆశీస్సులతో, నంద్యాల ప్రజలందరి కుటుంబాలలో సర్వ విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు వెల్లివిరియాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మట్టి వినాయకులనే పూజించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, అనుపూరి ఈశ్వర్, నూర్ భాషా, మనీష్ రెడ్డి, గోవింద నాయుడు, మురళి, దీపక్ రెడ్డి, అశోక్, ఉప్పరి సురేష్, బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తా, స్వామి నాయక్, రాజా, ప్రహ్లాద్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించారు.