ఢిల్లీకి చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
జితిన్ ప్రసాద సాదర స్వాగతం
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతదేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈశాన్య ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. షీ జిన్‌పింగ్ వెంట చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, సీపీసీ సీనియర్ నేత కై క్వి సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.
ఈ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. సమతుల్యమైన, ప్రాతినిధ్యం కలిగిన బహుళ ధృవ ప్రపంచ రూపకల్పనకు చైనాతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తంతో భారత్ ఈ సదస్సును నిర్వహిస్తుండగా.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, కృత్రిమ మేధస్సు మరియు పర్యావరణ పరిరక్షణపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.