ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం
ఆఫ్రికన్ వ్యాపార దిగ్గజాల ప్రశంసలు
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం అత్యంత వేగవంతమైన ఆర్థిక పురోగతిని సాధిస్తోందని, 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకుంటుందని ఆఫ్రికన్ వ్యాపార నాయకులు కొనియాడారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆఫ్రికన్ వ్యాపార దిగ్గజాలు ఐఏఎన్ఎస్ (IANS) ప్రతినిధులతో మాట్లాడుతూ భారత్ సాధిస్తున్న అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.
నైజీరియా డిప్లొమాటిక్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ (డికాన్) ఛైర్మన్ ఇదేహై ఫ్రెడరిక్ మాట్లాడుతూ.. నైజీరియాలో ప్రభుత్వ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న దేశం భారతదేశమేనని, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని అన్నారు. అలాగే ఇథియోపియాకు చెందిన అబిస్సినియా బిజినెస్ నెట్‌వర్క్ ఎంపీ డేనియల్ తిరునేహ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇటీవల ఇథియోపియాలో చేసిన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. బ్రిక్స్ వేదికగా భారత్ అందిస్తున్న నాయకత్వం గ్లోబల్ సౌత్ దేశాలకు ఎంతో ఆశాజనకంగా ఉందని వ్యాపార వేత్తలు పేర్కొన్నారు.