రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం
న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం ప్రారంభమైన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పలకరింపుల వేదిక వెనుక తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి సహా పలువురు అగ్రనేతలకు ప్రధాని ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మరియు ఇతర నేతలకు వివరించారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, రామాయణ ప్రశస్తి కలిగిన రామనాథస్వామి ఆలయ ప్రాంగణం భారతదేశ ప్రాచీన సంస్కృతి, భక్తి మరియు వాస్తు శిల్ప కళాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత" అనే ఇతివృత్తంతో భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. "మానవత్వమే ప్రథమం" అనే స్ఫూర్తితో కూడిన భారత్ దార్శనికతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ స్వాగత ఏర్పాట్లు చేపట్టినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.