పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేశ విగ్రహాలనే వినియోగించాలి- కలెక్టర్ రాజకుమారి గణియా
13న ఉచితంగా 3 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల అర్బన్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం (13-09-2026) ఉచితంగా 3,000 మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ భవనం సమీపంలోని రెవెన్యూ క్లినిక్ వద్ద ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి చేతుల మీదుగా ఉచిత మట్టి గణేశ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.*
*వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని సహజ మట్టితో తయారు చేసిన గణేశ విగ్రహాలను ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగం ద్వారా జలవనరులు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. “మట్టి వినాయకుడు - పర్యావరణానికి మేలు” అనే సందేశంతో పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజలు, భక్తులతో పాటు జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా పంపిణీ చేసే మట్టి గణేశ విగ్రహాలను స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.