గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు. సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, సెప్టెంబర్ 3, మేజర్ న్యూస్: అనకాపల్లి జిల్లాను సంపూర్ణ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు, నిఘా చర్యలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఒడిస్సా నుంచి అనకాపల్లి మీదుగా తుని వైపు తరలిస్తున్న 600 కేజీల భారీ గంజాయిని, రవాణాకు ఉపయోగించిన వాహనాలను అనకాపల్లి రూరల్ పోలీసులు సమయస్ఫూర్తితో పట్టుకున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన ఏ-1 షేక్ మస్తాన్ వలి గతంలో జి.మాడుగుల పీఎస్ (క్రైం నెంబరు .7/2023) పరిధిలో గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉండగా, అదే జైలులో ఉన్న నర్సీపట్నానికి చెందిన ఏ-3తో పరిచయం ఏర్పడింది. ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ దగుడుపల్లికి చెందిన ఏ-2 నుంచి 600 కేజీల గంజాయిని సమకూర్చి, తుని సమీపంలో అప్పగిస్తే సరుకు ఖరీదు కాకుండా అదనంగా రూ.3,00,000 కమీషన్ ఇస్తానని ఏ-3 ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏ-2 వద్ద గంజాయి కొనుగోలు చేసి, ఏ-5, ఏ-6 (పాంగి రత్నాలు)ల సహాయంతో చెక్‌పోస్టులు తప్పించేందుకు ఒడిస్సా సరిహద్దుల నుండి నడక ద్వారా, మోటార్ సైకిళ్లపై దఫదఫాలుగా తరలించారు. అనంతరం ఆ సరుకును వ్యాన్ (ఏపీ39 వీఏ 6786)లోకి లోడ్ చేసి, దానికి పైలట్‌గా హోండా సివిక్ కారు (ఏపీ16 బీసీ 0018)ను ఏర్పాటు చేసుకుని తుని వైపు తరలించేందుకు పన్నాగం పన్నారు. పక్కా ముందస్తు సమాచారంతో అనకాపల్లి రూరల్ ఎస్సై, సిబ్బంది రంగంలోకి దిగి అనకాపల్లి మండలం సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి గంజాయి లోడుతో ఉన్న వ్యాన్‌తో పాటు పైలట్ కారును పట్టుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు షేక్ మస్తాన్ వలి (ఏ-1) – ధర్మాజీగూడెం, షేక్ మదీనా (ఏ-4), పాంగి రత్నాలు (ఏ-6) – అల్లూరి సీతారామరాజు జిల్లా. పరారీలో ఉన్న నిందితులు ఏ-2 (ఒడిస్సా మూలం), ఏ-3 (నర్సీపట్నం), ఏ-5 (అల్లూరి జిల్లా). వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు 600 కేజీల గంజాయి, రవాణాకు ఉపయోగించిన వ్యాన్, పైలట్ వెహికిల్ హోండా సివిక్ కారు. ఏ-1పై గతంలో 2 కేసులు, ఏ-3పై 5 కేసులు ఉన్నాయి. ఏ-3పై పిట్ ఎన్డీపీఎస్ కింద పీడీ యాక్ట్ అమలుకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన ఎస్.బి సీఐ ఎస్.బాల సూర్యరావు, టౌన్ సీఐ జి.ప్రేమ్ కుమార్, రూరల్ సీఐ జి.అశోక్ కుమార్, రూరల్ ఎస్సై జి.రవికుమార్, టౌన్ ఎస్సై షేక్ జిలాని, ఈగల్ టీం సీఐలు టీ.ధనుంజయ నాయుడు, వి.నాగరాజులను ఎస్పీ అభినందించి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీ ఈ.శ్రీనివాసులు పాల్గొన్నారు.