|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 07:50 PM
హైదరాబాద్ కూకట్‌పల్లి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితులను గుర్తించి జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవటంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక పాత్ర పోషించింది. హత్య తర్వాత నిందితులు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు ఛేదన సులభమైంది.
కూకట్‌పల్లి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో నివసించే రేణు అగర్వాల్‌ను ఆమె ఇంట్లో పనిచేసే హర్ష, అదే అపార్ట్‌మెంట్‌లో పనిచేసే రోషన్ కలిసి దారుణంగా హత్య చేశారు. నిందితులు పది రోజుల క్రితమే పనిలో చేరినట్లు పోలీసులు గుర్తించారు. వీరు రేణు అగర్వాల్‌ను ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి, కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా చంపారు. హత్య అనంతరం సుమారు 6 తులాల మంగళసూత్రం, ఖరీదైన వాచీలు, మరికొంత నగదుతో పరారయ్యారు.
హత్య తర్వాత నిందితులు హఫీజ్‌పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద తమ స్కూటీని వదిలి అక్కడి నుంచి క్యాబ్‌లో విశాఖపట్నం మీదుగా జార్ఖండ్‌లోని రాంచీకి పారిపోయారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సొంత ఇంటికి కూడా వెళ్లకుండా ఓయో రూమ్‌లలో దాక్కున్నారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఇద్దరూ బ్యాగుతో లిఫ్ట్‌లో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ కేసు దర్యాప్తులో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వారు వదిలి వెళ్ళిన స్కూటీని గుర్తించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. అయితే, నిందితులు రాంచీకి పారిపోయిన విషయం వారికి తెలియలేదు. ఈ సమయంలోనే ఊహించని విధంగా ఒక క్లూ లభించింది.
నిందితులు రాంచీకి వెళ్ళడానికి ఉపయోగించిన క్యాబ్ డ్రైవర్, ప్రయాణం మధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టును గమనించాడు. హత్య వార్తలను చూసి, అందులోని ఫోటోలు తన క్యాబ్‌లో ప్రయాణించిన వ్యక్తులకు సరిపోలడం గమనించాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సమాచారం ఆధారంగా ఒక ప్రత్యేక బృందం జార్ఖండ్ వెళ్లి.. రాంచీలోని ఓయో రూమ్‌లో దాక్కున్న నిందితులను పట్టుకున్నారు. పోలీసులు టెక్నికల్, ఇతర ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.