|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 06:36 PM
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై సొంత పార్టీకే చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖకు ఆయన బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు.తన నియోజకవర్గ పరిధిలోని విషయాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవడంపై నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో ఉన్నవారు నియోజకవర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని, అనవసరంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని ఆయన సూచించారు. తన నియోజకవర్గంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయ కమిటీ సభ్యుల నియామకంలో మంత్రి సురేఖ తనకు నచ్చిన వారికి పదవులు ఇప్పించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నాయిని, మంత్రి జోక్యం గురించి పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. ఒకే పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఇలాంటి బహిరంగ విమర్శలు వెలువడటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ కమిటీ నియామకాల వివాదం వీరి మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేసింది.