వానలు పడాలని వేడుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు
చిన్నకోడూరు (సిద్దిపేట): వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో, రైతుల కష్టాలు తీర్చి వానలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మహిళలు శనివారం బతుకమ్మ ఆడారు.
గ్రామంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ పాటలతో బతుకమ్మలు ఆడుతూ వాన దేవుడిని వేడుకున్నారు. పంటలు పండి రైతాంగం సంతోషంగా ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.