శాస్త్రీయ దృక్పథం, ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దాలి
ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పిలుపు
న్యూఢిల్లీ:విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, ‘దేశమే ప్రథమం’ అనే ఉన్నతమైన స్ఫూర్తితో నవతరాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మేధో వికాసం; భవిష్యత్తు నిర్మాణం’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో ఆమె ఈ సందేశాన్ని అందించారు.
పాఠ్యాంశాలు బోధించడానికే పరిమితం కాకుండా, విద్యార్థులను నైతిక విలువల కలిగిన మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల పవిత్ర కర్తవ్యమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, భవిష్యత్తుపై అపారమైన విశ్వాసంతో బడికి పంపుతారని, ఆ పవిత్రమైన నమ్మకాన్ని ఉపాధ్యాయులు కాపాడాలని సూచించారు. గురువుల ప్రవర్తన విద్యార్థుల్లో భయం, ఆందోళన లేదా న్యూనతా భావాన్ని కలిగించేలా ఉండకూడదని, వారి మనోధైర్యాన్ని పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. పిల్లల్లో ప్రశ్నలు అడిగే తత్వాన్ని, జిజ్ఞాసను, విచక్షణ జ్ఞానాన్ని ప్రోత్సహించడం బోధనలో అత్యంత కీలకమైన అంశమని అన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే.. పర్యావరణ పరిరక్షణ, మానవాళి సంక్షేమం, అంత్యోదయ ఆదర్శాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.
ఉపాధ్యాయుల అంకితభావం, చిత్తశుద్ధిని గుర్తిస్తూ ప్రతి పౌరుడూ వారిని అత్యున్నత గౌరవంతో చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
ఇటువంటి స్ఫూర్తిదాయకమైన విద్య ద్వారానే దేశానికి అవసరమైన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సృజనాత్మక కళాకారులు తయారవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.