పిల్లలను స్క్రీన్ టైమ్, డ్రగ్స్ వ్యసనాల నుంచి కాపాడాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ స్క్రీన్ టైమ్ వ్యసనం, డ్రగ్స్ వినియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పురస్కార గ్రహీతలైన ఉపాధ్యాయులతో ముఖాముఖిగా మాట్లాడిన ప్రధాని, విద్యార్థుల జీవితాలను సన్మార్గంలో నడిపించడంలో విద్యా సమాజం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
స్క్రీన్ టైమ్ అనేది నేడు ఒక ప్రమాదకరమైన వ్యసనంగా మారిందని ప్రధాని అన్నారు. వీడియో గేమ్‌లకు దూరంగా, మైదానంలో ఆడే నిజమైన ఆటలపై పిల్లల్లో ఆసక్తి పెంచితేనే ఈ వ్యసనం నుంచి విముక్తి లభిస్తుందన్నారు. అందుకోసం పిల్లలను నిరంతరం సృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నం చేయాలని సూచించారు.
కొన్ని నగరాలు, విశ్వవిద్యాలయాల్లో వెలుగుచూస్తున్న డ్రగ్స్ సమస్యకు అవగాహన లోపమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు డ్రగ్స్ పరిణామాలు, ప్రమాదాలపై నిరంతరం అవగాహన కలిగి ఉండాలని, పిల్లల్లో వచ్చే ప్రవర్తనా మార్పులను నిశితంగా గమనించాలని కోరారు.
"పాఠ్యపుస్తకాలు, సిలబస్‌కే పరిమితం కాకుండా పిల్లల జీవితాలతో ఉపాధ్యాయులు నిజంగా మమేకం కావాలి. బాల్యాన్ని అంతరించిపోనివ్వకుండా పరిరక్షించే అత్యంత సమర్థులు గురువులే" అని స్పష్టం చేశారు. బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యత అని ఉద్ఘాటించారు.