హల్ద్వానీ అంశంపై కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్: హల్ద్వానీ పవిత్రీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మాట్లాడేందుకు అసలైన ప్రజా సమస్యలేమీ దొరకడం లేదని, అందుకే ముగిసిపోయిన హల్ద్వానీ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి పవిత్రీకరణ క్రతువు పేరిట ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.
ఉత్తరాఖండ్ బీజేపీ నాయకులపై కర్ణాటక పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న కుటిల విభజన రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అసలు అక్కడ ఎలాంటి పవిత్రీకరణ వివాదమే లేదని ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనాయకులు స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కావాలనే పెద్దది చేస్తూ అనవసర వివాదంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.