ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై సర్కార్ మౌనం.. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలంటూ రేవంత్ సర్కార్‌కు తెలంగాణ రక్షణ సేన అల్టిమేటం
సూర్య ఎడ్యుకేషన్ డెస్క్: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ రక్షణ సేన ధ్వజమెత్తింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతూ కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుంటే, ముఖ్యమంత్రిగా మరియు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని సూటిగా ప్రశ్నించింది. రెండు రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని, లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకుని రాష్ట్రవ్యాప్త ప్రజాపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది.
విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన ఆరోపించింది. గతంలో 2024 మే నెలలోనే స్కూల్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేసింది. అయితే దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు సిద్ధమై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కేబినెట్ ఆమోదం దాటి ముందుకు ఎందుకు రాలేదని నిలదీసింది. కార్పొరేట్ విద్యా వ్యాపారుల ఒత్తిళ్లకు తలొగ్గే ఈ కీలక బిల్లును తొక్కిపెట్టారా అనే అనుమానాలను వ్యక్తం చేసింది.
హైదరాబాద్ నడిబొడ్డున సుమారు వంద ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిలో నడుస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైతం ఈ విద్యా సంవత్సరంలో భారీగా ఫీజులు పెంచినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. ప్రభుత్వ భూములను, వనరులను పొందుతూ నడుస్తున్న విద్యాసంస్థల్లోనే ఇంతటి దోపిడీ జరుగుతుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించింది. సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ పాఠశాలలను నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ, వేలాది రూపాయల డొనేషన్లు గుంజుతున్న కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని మండిపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 1994లో జారీ చేసిన చారిత్రక జీవో ఎం.ఎస్. 01 నిబంధనలను పాలకులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని రక్షణ సేన గుర్తు చేసింది. ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నిర్ణయాన్ని ఆయా పాఠశాలల గవర్నింగ్ బాడీ మాత్రమే ఖరారు చేయాలని, వార్షిక ఫీజుల పెంపు ఎట్టి పరిస్థితుల్లోనూ అయిదు శాతానికి మించకూడదని స్పష్టమైన చట్టబద్ధ నిబంధనలు ఉన్నాయి. ఇంతటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ తెలంగాణలో జీవో నంబర్ 01 ఎందుకు అమలు కావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఫీజుల నియంత్రణ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. చట్టాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రైవేట్, అంతర్జాతీయ పాఠశాలల్లో పకడ్బందీగా అమలయ్యేలా విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు కఠిన జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఈ సమావేశాల్లో చట్టాన్ని తీసుకురావడంలో విఫలమైతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు, ధర్నాలకు దిగుతామని హెచ్చరించింది.