ఢిల్లీలో 116 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌కు రాష్ట్ర పురస్కారాలు
పాఠశాలల అభివృద్ధిపై సీఎం రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా రంగంలో విశేష సేవలు అందించిన 116 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లకు ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారాలను ప్రదానం చేసింది. త్యాగరాజ్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ‘శిక్షక్ మహాకుంభ్’ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ అవార్డులను అందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడూ, పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు పాఠ్యప్రణాళికలోని లోపాలను సరిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
విద్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే మొదట పాఠశాలల్లో ప్రాథమిక వసతులు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, నిర్వహణ, సున్నం వేయడం వంటి పనులను ప్రభుత్వం శరవేగంగా చేపడుతోందని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చాలా పాఠశాలల్లో బాలికలకు సరైన మరుగుదొడ్ల వసతి కూడా లేకుండా పోయిందని, అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయి నుంచి పనులు ప్రారంభించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు వీలుగా కోర్సులు, పాఠ్యప్రణాళికల్లో అవసరమైన మార్పులపై విద్యాశాఖ నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా, ఎంపీ బసురి స్వరాజ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.