స్నాప్ చాట్ లో పరిచయం ఆమెకు జరిగింది ఆర్ధిక మోసం
లక్ష కాదు అక్షరాల కోటి 38లక్షలుచివరికి
చనిపోతానని బెదిరించి - యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
హైదరాబాద్: చనిపోతానంటూ భయపెట్టి యువతి నుంచి విడతల వారీగా రూ.1.38 కోట్లు వసూలు చేసిన యువకుడిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం విజయవాడ సూర్యారావుపేటకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆమెకు మద్దిశెట్టి గౌతంనాయుడు అనే యువకుడు స్నాప్‌చాట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను విప్రోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నానని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట తన ఊరు అని చెప్పాడు.
తరచూ వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు.ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ కలిసి కోయంబత్తూరు టూర్ వెళ్లారు. అక్కడ గౌతంనాయుడు తాను ఆన్‌లైన్ క్రిప్టోకరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, అది బ్లాక్ అయిందని చెప్పాడు. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని అడిగాడు. యువతి లోన్ యాప్‌ల్లో రుణాలు తీసుకుని అతడికి రూ.10.42 లక్షలు ఇచ్చింది.
ఇంకా డబ్బులు కావాలనడంతో తన వద్ద లేవని తేల్చి చెప్పింది. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆమెను గౌతంనాయుడు బెదిరించాడు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నట్లు ఫొటో వాట్సప్‌లో పంపాడు. దాంతో ఆమె బెంబేలెత్తిపోయారు. తల్లికి చెప్పకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి, క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని మరో రూ.1.27 కోట్లు అతడికి ఇచ్చారు. అయినా ఇంకా కావాలని బెదిరిస్తుండటంతో భయపడిన ఆమె.. ఏం చేయాలో తోచక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.