మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
13 మంది విద్యార్థులకు అస్వస్థత
ఖమ్మం: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) తిన్న 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పాఠశాలలో అందించిన అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలను సందర్శించి అల్పాహారం శాంపిళ్లను సేకరించి విచారణ చేపట్టారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.