మనం గెలిచింది 2% ఓట్లతోనే.. జాగ్రత్తగా ఉండాలి
కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఆమె పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, "మనం గత ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి" అని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగిపోతున్నాయని, అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలదేనని ఆమె తేల్చి చెప్పారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోతే అది రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు అవకాశాలకే తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ, అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.