'ఇరుముడి' సినిమాలోని ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలి
ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్
అమరావతి:సరికొత్తగా తెరకెక్కిన 'ఇరుముడి' సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను అవమానించే విధంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్ చేసింది. సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను అత్యంత ప్రతికూలంగా చిత్రీకరించడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా సమాఖ్య నాయకులు మాట్లాడుతూ.. సినిమాలో కనిపించే సన్నివేశాల్లో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ప్రభుత్వ పాఠశాల స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అంతేకాకుండా, అందులోని విద్యార్థులు ధరించిన యూనిఫామ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు వేసుకునే యూనిఫామ్‌తో పూర్తిగా సరిపోలుతోందని పేర్కొన్నారు. దీనివల్ల ఈ సన్నివేశాలను కేవలం కల్పిత పాత్రలుగా భావించడానికి వీల్లేదని, కావాలనే ప్రభుత్వ విద్యారంగాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు.
సమాజంలో ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ సన్నివేశాలను చిత్ర నిర్మాతలు వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.