2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం
భారత్-రష్యా సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్
మాస్కో: భారత్-రష్యాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యంలో నెలకొన్న అసమతుల్యతను తొలగించి, 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఉమ్మడి వర్తక లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయమని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన 27వ భారత్-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్ (IRIGC-TEC) సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు మార్కెట్ ప్రవేశం, సుంకాలు (Tariffs) మరియు సుంకేతర అడ్డంకులను తొలగించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
భారత్ - యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చల్లో పురోగతిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంధనం, అణుశక్తి, లోహశాస్త్రం, అంతరిక్ష పరిశోధనలు, రైల్వేలు, ఎరువుల సరఫరాతో పాటు నైపుణ్యాల బదిలీ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉందన్నారు.
ఈ సమావేశ చర్చలు ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక మరియు వాణిజ్య సంబంధాలకు మరింత ఊపునిస్తాయని జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.