ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం
మేడ్చల్ మల్కాజిగిరి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే జిల్లా అధికార యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం (ఐడివోసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం ప్రదర్శించవద్దని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి మొత్తం 75 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌వో) మాలతితో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.