లేడీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కూతురు
శ్రీరంగపట్నం: కర్ణాటకలోని మండ్యా జిల్లా శ్రీరంగపట్నం తాలూకా పరిధిలోని ఆరతి ఉక్కడ ఆలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య, విధుల్లో ఉన్న మహిళా పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (PSI) సవిత బి. పాటిల్‌పై దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
భీమన అమవాస్య సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఆ సమయంలో దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య, క్యూలైన్‌ను దాటుకుని నేరుగా గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ సవిత ఆమెను అడ్డుకుని, భక్తుల రద్దీ దృష్ట్యా కొద్దిసేపు క్యూలైన్‌లో వేచి ఉండాలని కోరారు.
దీంతో ఆగ్రహానికి గురైన ఐశ్వర్య.. తాను ఎమ్మెల్యే కూతురినని చెబుతూ ఎస్ఐతో గొడవకు దిగారు. తీవ్ర వివాదం చెలరేగడంతో ఐశ్వర్య సదరు మహిళా అధికారిని బూతులు తిడుతూ చెంపపై కొట్టారు. ఈ ఘటనతో తీవ్ర విస్తుపోయిన ఎస్ఐ సవిత వెంటనే క్యాసనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు
బాధితురాలైన పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద విధులకు భంగం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, బెదిరింపులకు దిగడం వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సురేష్ గౌడ.. తన కూతురు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, ఈ ఘటనపై క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.