ప్రాణం పోయాక వస్తారా డాక్టర్లు...?!
బషీరాబాద్ CHCలో వైద్యుల కోసం రోగుల పడిగాపులు
బషీరాబాద్ ,మేజర్ న్యూస్ :మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో వైద్య సేవలపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే వైద్యం కోసం ఆసుపత్రికి చేరుకున్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు వైద్యుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.బుధవారం ఉదయం వైద్యం కోసం CHCకి వచ్చిన పలువురు రోగులు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి వరండాలోని బెంచీలపై నిరీక్షించాల్సి వచ్చింది. అనారోగ్యంతో వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటని రోగులు ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రాణం పోయాక వస్తారా డాక్టర్లు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోతే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. CHCలో వైద్యుల సమయపాలనపై పర్యవేక్షణ పెంచడంతో పాటు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బషీరాబాద్ CHCలో వైద్య సేవలు మెరుగుపరిచి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.