భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం
వెల్లింగ్టన్:భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) అమలు చేసేందుకు ఉద్దేశించిన చట్టాన్ని న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కు జరిగే న్యూజిలాండ్ ఎగుమతులలో సుమారు 95 శాతం వస్తువులపై సుంకాలు పూర్తిగా తొలగించబడతాయి లేదా గణనీయంగా తగ్గించబడతాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీ మద్దతుతో ఈ చట్టం 93-29 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇది అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే, పరిధిలోకి వచ్చే సగానికి పైగా ఉత్పత్తులు సుంకరహితంగా మారనున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా ఎగుమతిదారులకు తక్షణమే గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే తెలిపారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేస్తామన్న తమ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని, ఈ నాణ్యమైన ఒప్పందం ఈ ఏడాదే అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం అన్ని భారతీయ వస్తువులకు న్యూజిలాండ్‌లోకి సుంకరహిత ప్రవేశం లభించనుంది. అంతేకాకుండా, రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కూడా న్యూజిలాండ్ అంగీకరించింది. ఇరు దేశాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
జూన్ 2026 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం 3.99 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లకు (సుమారు 2.29 బిలియన్ అగ్రరాజ్య డాలర్లు) చేరింది. భారతదేశం న్యూజిలాండ్‌కు తొమ్మిదవ అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా నిలిచింది. ఇరు దేశాల్లో అధికారిక ఆమోద ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.