2029 నాటికి ‘స్వచ్ఛ యమున’ లక్ష్యం సాకారం: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న నిరంతర కృషి ఫలితంగా 2029 నాటికి ‘స్వచ్ఛ యమున’ లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన కిషౌ బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
రాష్ట్రాల మధ్య నీటి పంపిణీలో నది పర్యావరణ ప్రవాహాన్ని (environmental flow) తగినంతగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల యమునా జలాల కేటాయింపులో తీవ్ర లోపం జరిగిందని హోం మంత్రి పేర్కొన్నారు. కిషౌ ప్రాజెక్ట్ ద్వారా అదనంగా 25 శాతం నీరు అందుబాటులోకి వస్తుందని, ఇది ఢిల్లీకి, యమునా నదికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతర కృషి జరుగుతోందని షా తెలిపారు. ప్రయాగ్‌రాజ్ వద్ద యమునా నది గంగతో కలుస్తుంది కాబట్టి, 'స్వచ్ఛ గంగ' లక్ష్యాన్ని సాధించడానికి యమునను శుభ్రపరచడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నది శుభ్రత దిశగా ఢిల్లీ ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలు పూర్తి సహకారంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ కింద ఉత్తరాఖండ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని 'టోన్స్' నదిపై 232.6 మీటర్ల ఎత్తు గల కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్టను నిర్మిస్తారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 1,562 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది. దీని ద్వారా సుమారు 97,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని, 1,476 మిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఈ ప్రాజెక్ట్ వల్ల ఢిల్లీ అత్యధిక ప్రయోజనం పొందుతుందని ఆయన వివరించారు.
భారత ప్రభుత్వం దీనిని 'జాతీయ ప్రాజెక్ట్'గా ప్రకటించినందున 90 శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని, మిగిలిన 10 శాతాన్ని 1994 ఒప్పందం ప్రకారం ఆరు రాష్ట్రాలు పంచుకుంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వ్యక్తంచేసిన ఆందోళనలను కేంద్ర పథకాల ద్వారా పరిగణనలోకి తీసుకుని, ఆర్థిక భారాన్ని అధిగమించడంలో ఆ రాష్ట్రానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం, ఆరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయని హోం మంత్రి పేర్కొన్నారు.