సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు
సూర్యా న్యూస్ డెస్క్
ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారని, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న రైతుల ఇబ్బందులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్యలు మరియు సెక్షన్ 22ఏ తదితర కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం తప్పుకుంటోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా కొరతతో పాటు కరెంట్ కోతలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని మార్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
సభలో ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక, కావాలనే సస్పెన్షన్ల అస్త్రం ప్రయోగిస్తున్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు. తాము సభలో ప్రశ్నించకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పాలకులు ప్రచార ఆర్భాటాలు మాని, క్షేత్రస్థైస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.