దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత కబడ్డీ జట్టు..
షూటింగ్‌లో స్వర్ణ పోరుకు వలరివన్-మానే జోడీ
సూర్య స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు తమ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. మంగళవారం జరిగిన పురుషుల కబడ్డీ గ్రూప్-ఎ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 63-31 పాయింట్ల భారీ తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించిన భారత జట్టు, ఈ మ్యాచ్‌లోనూ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రథమార్ధంలోనే రెండుసార్లు కొరియాను ఆలౌట్ చేసి 34-14తో బలమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలోనూ అదే జోరును కొనసాగించి 32 పాయింట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
మరోవైపు షూటింగ్‌లో భారత్‌కు పతక అవకాశాలు మెరుగయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత షూటర్లు ఎలావెనిల్ వలరివన్, పార్థ్ రాకేష్ మానేల జోడీ 634.9 స్కోరుతో క్వాలిఫికేషన్‌లో రెండో స్థానంలో నిలిచి స్వర్ణ పతక ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ప్రక్రియలో భారత జోడీ ప్రస్తుత ఆసియా రికార్డును అధిగమించడం విశేషం. ఇదే విభాగంలో చైనా జోడీ 638.9 స్కోరుతో సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫైనల్ ఫార్మాట్‌లో మార్పులు చేయడంతో అర్హత సాధించిన నాలుగు జట్లు ఒకేసారి ఫైనల్ రౌండ్‌లో పోటీపడనున్నాయి.
ఇతర క్రీడాంశాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ గ్రూప్-డి మ్యాచ్‌లో జై మీనా 4-0తో పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అరైన్‌పై ఘనవిజయం సాధించగా, మహిళల సింగిల్స్‌లో ఆద్య తివారీ 1-4 తేడాతో థాయిలాండ్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైంది. అలాగే వుషు మహిళల నాన్‌క్వాన్ ఫైనల్‌లో భారత అథ్లెట్ లాంగ్లెంటోంబి దేవి హంజబామ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.