ముంబై దహీ హండి వేడుకల్లో విషాదం
ప్రమాదాల్లో 168 మందికి గాయాలు, ఏడేళ్ల బాలుడు మృతి
ముంబై: కృష్ణాష్టమి సందర్భంగా ముంబై నగరం వ్యాప్తంగా వైభవంగా నిర్వహించిన 'దహీ హండి' వేడుకల్లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మానవ పిరమిడ్లు కూలిపోవడం, ఇతర ప్రమాదాల కారణంగా నగరవ్యాప్తంగా 168 మంది గాయపడినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం వెల్లడించింది.
మొత్తం గాయపడిన 168 మందిలో 29 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరగా, 81 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరో 58 మంది ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. సివిక్ ఆసుపత్రుల్లో అత్యధికంగా 106 మంది చేరగా, అందులో కేఈఎమ్ (KEM) ఆసుపత్రిలోనే 33 మంది చికిత్స పొందారు. రాజావాడి ఆసుపత్రిలో 20 మంది, నాయర్ ఆసుపత్రిలో 17 మంది, పోట్దార్ ఆసుపత్రిలో 16 మంది, హిందూజాలో 14 మంది, బీడీబీఏ ఆసుపత్రిలో 13 మంది గాయపడిన వారికి చికిత్స అందించారు. తూర్పు శివారు ప్రాంతాల ఆసుపత్రులలో 29 మంది, పశ్చిమ శివారు ప్రాంతాలలో 33 మంది బాధితులు నమోదు అయ్యారు.
ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో స్థానికంగా దహీ హండి వేడుకలు నిర్వహిస్తుండగా ఊహించని విధంగా ఇటుక స్తంభం కూలిపోయింది. ఈ ప్రమాదంలో రుద్ర కదమ్ అనే ఏడేళ్ల బాలుడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని మాల్వానీ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.