కాలిఫోర్నియాలో చిన్న విమానం కూలింది
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం ఒక చిన్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. వాయువ్య ఫ్రెస్నో ప్రాంతంలో విమానం కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఫ్రెస్నో అగ్నిమాపక శాఖను ఉటంకిస్తూ 'ఏబీసీ30 న్యూస్' కథనం ప్రచురించింది.
బ్లైత్ అవెన్యూలోని 'సియెర్రా స్కై పార్క్ విమానాశ్రయం' సమీపంలో ఈ విమానం కూలిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ అత్యవసర చికిత్స నిమిత్తం విషమ పరిస్థితిలో సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత కారణంగా సమీప ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, పీజీ&ఈ సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫ్రెస్నో పోలీస్, అగ్నిమాపక శాఖ, ఫ్రెస్నో కౌంటీ షెరీఫ్ కార్యాలయం తదితర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, విమానం ఏ పరిస్థితుల్లో కూలిపోయిందనే దానికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.