హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికా మధ్య పరస్పర నౌకా దాడులు
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది. తమ మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా, వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లు మరియు అమెరికాకు అనుబంధంగా ఉన్న మరో మూడు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) నౌకాదళం ప్రకటించింది.
హోర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఐఆర్‌జిసి ఆరోపించింది. తమ నౌకలపై దాడికి సమాధానంగానే, ఖురాన్ సూత్రాలకు లోబడి అనధికారిక జలమార్గాల్లో ప్రయాణిస్తున్న అమెరికా అనుబంధ నౌకలపై ప్రతీకార దాడులు చేసినట్లు తెలిపింది.
అంతకుముందు రోజు (సెప్టెంబర్ 5న) తమ యుద్ధనౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో, దానికి నిరోధకంగా ఐఆర్‌జిసికి చెందిన ఎం/టి డౌనీ, ఎం/టి స్టార్క్ 1, మరియు ఎం/టి కైలో అనే మూడు ముడి చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ ట్యాంకర్లు ఇరాన్ ప్రాక్సీలకు నిధులు సమకూర్చే నిరసన నెట్‌వర్క్‌లో భాగమని సెంట్ కామ్ పేర్కొంది. అనధికారిక జలమార్గాల్లో ప్రయాణించి అమెరికా బలగాల చేతిలో మోసపోవద్దని, అలా చేస్తే దాడులు తప్పవని జలసంధిలో ప్రయాణించే ఇతర వాణిజ్య నౌకలను ఐఆర్‌జిసి హెచ్చరించింది.
ఇరాన్ వాణిజ్య నౌకలను వేధించడం లేదా నావికా దిగ్బంధనం విధించే ప్రయత్నాలు కొనసాగితే, ప్రాంతీయ జలాల్లో ఉన్న అమెరికా సైనిక నౌకలపై దాడులను తీవ్రతరం చేస్తామని ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించారు. తమ వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా, యుద్ధ నేరంగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. రాబోయే పర్యవసానాలకు అమెరికా, దాని మిత్రదేశాలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.