గుజరాత్‌లో పోలీసుల 'తక్షణ న్యాయం'
హత్య నిందితుడిని వీధిలో ఊరేగిస్తూ 105 దెబ్బలు, వీడియో వైరల్
రాజ్‌కోట్: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణ హత్యకు పాల్పడిన ఒక నిందితుడికి పోలీసులు బహిరంగంగా 'శిక్ష' విధించడం తీవ్ర వివాదాస్పదమైంది. నేర స్థల పరిశీలన (సీన్ రీక్రియేషన్) పేరుతో హత్య నిందితుడిని బస్ స్టాండ్ వద్ద తాడుతో కట్టి, ఊరేగిస్తూ కర్రలతో 105 సార్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీలంబౌగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌టీ (ST) బస్ స్టాండ్ వద్ద సహజీవనం చేస్తున్న కాజల్‌బెన్ (40) అనే మహిళపై ఫైజల్ అలియాస్ ఖట్కీ లఖానీ (25) తీవ్రంగా దాడి చేశాడు. వేరొకరితో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమె జుట్టు పట్టుకుని తల, మెడను పదేపదే నేలకేసి కొట్టడంతో ఆమె ఆసుపత్రిలో మరణించింది. ఈ క్రూరమైన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, శుక్రవారం పంచనామా మరియు సీన్ రీక్రియేషన్ కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నీలంబౌగ్ పోలీసులు నిందితుడిని బహిరంగంగా ఊరేగిస్తూ 105 సార్లు కొట్టారు.
ఫైజల్ పాత నేరస్థుడని, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఈ ఘాతకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. సమాజంలో నేరస్థులకు గట్టి సందేశం పంపడానికే ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడి క్రూరత్వం ఒకవైపు, న్యాయస్థానంలో హాజరుపరచడానికి ముందే పోలీసులు వీధుల్లో అమలు చేసిన 'తక్షణ న్యాయం' (Instant Justice) మరోవైపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.