గుర్తింపు లేని మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉక్కుపాదం
రాష్ట్రవ్యాప్తంగా 17 మదర్సాలు సీల్
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న మదర్సాలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. డెహ్రాడూన్, హల్ద్వాని నగరాల్లో నిర్వహించిన తనిఖీల్లో గుర్తింపు లేని పలు మదర్సాలను అధికారులు సీల్ చేశారు. తాజా చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా సీల్ చేసిన గుర్తింపు లేని మదర్సాల సంఖ్య 17కి చేరగా, మరికొన్ని మదర్సాలు తమ కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపివేశాయి.
తాజాగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భాగంగా డెహ్రాడూన్‌లో మూడు, హల్ద్వానిలో రెండు గుర్తింపు లేని మదర్సాలను అధికారులు శాశ్వతంగా సీల్ చేశారు. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ పరాగ్ మధుకర్ ధకాటే మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 గుర్తింపు లేని మదర్సాలను సీల్ చేశామని వెల్లడించారు.
మరో మూడు మదర్సాల నిర్వాహకులు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారని, దీంతో ఇప్పటివరకు మొత్తం 20 గుర్తింపు లేని మదర్సాల నిర్వహణ నిలిచిపోయిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, చట్టబద్ధమైన అనుమతులు లేని విద్యాసంస్థలు, మదర్సాలపై నిఘా కొనసాగుతుందని, నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.