మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
పణాజీ:కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి గోవాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఘన స్వాగతం పలికారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా హోం మంత్రి పలు అధికారిక, రాజకీయ మరియు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీలలో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు. ఆదివారం ఉదయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించి గోవా అంశాలపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం మాదకద్రవ్యాల (డ్రగ్స్) నియంత్రణపై ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. ఆదివారం సాయంత్రం 'అటల్ భవన్'లో నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
సోమవారం పనాజీలో జరగనున్న ‘వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్’ 28వ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు. జోనల్ కౌన్సిల్ భేటీ అనంతరం తలేగావ్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్స్' (President's Colours) అవార్డును ప్రదానం చేయనున్నారు.