యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ
చెన్నై: దేశంలో జీవ వనరుల వినియోగానికి సంబంధించి 'యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్' (ABS) విధానాన్ని అమలు చేయడంలో జాతీయ జీవవైవిధ్య అథారిటీ (NBA) చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 27 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల జీవవైవిధ్య కౌన్సిళ్లకు తాజాగా రూ. 8.23 కోట్లు మంజూరు చేయడంతో, మొత్తం పంపిణీ చేసిన నిధుల విలువ రూ. 200 కోట్ల మార్కును దాటింది.
Nunhems India, East West Seeds, Bayer Science & Innovation వంటి ప్రముఖ విత్తన కంపెనీలు కాకర, బెండ, మిరప, ఉల్లిపాయ పంటలను పరిశోధన, వాణిజ్య అవసరాలకు వినియోగించుకున్నందుకుగాను ఈ నిధులను చెల్లించాయి. ఈ జీవ వనరులను బహిరంగ మార్కెట్ల ద్వారా సేకరించడం వల్ల నిర్దిష్ట రైతులను లేదా మూల ప్రాంతాలను గుర్తించడం సాధ్యపడలేదు. దీంతో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నమోదు చేసిన పంట సాగు విస్తీర్ణ గణాంకాల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు నిధులను కేటాయించారు.
ఈ కేటాయింపుల్లో మధ్యప్రదేశ్ రూ. 1.17 కోట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, దేశంలో ఉల్లి సాగులో 49 శాతానికి పైగా వాటా ఉన్న మహారాష్ట్ర రూ. 1.01 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రూ. 75.55 లక్షలు, కర్ణాటక రూ. 65.23 లక్షలు, గుజరాత్ రూ. 64.06 లక్షలు, ఒడిశా రూ. 57.63 లక్షలు, బీహార్ రూ. 47.63 లక్షలు, ఛత్తీస్‌గఢ్ రూ. 39.91 లక్షలు, పశ్చిమ బెంగాల్ రూ. 36.05 లక్షలు, ఉత్తరప్రదేశ్ రూ. 35.72 లక్షలు అందుకోనున్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 1.83 కోట్లు దక్కనున్నాయి.
పర్యావరణ పునరుద్ధరణకు వినియోగం: జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం లభించిన ఈ నిధులను ప్రజల జీవవైవిధ్య రిజిస్టర్ల నవీకరణ, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల రక్షణ, నిర్వహణ కమిటీల బలోపేతం మరియు స్థానిక ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వినియోగిస్తారు. కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లోని 'లక్ష్యం 13'తో పాటు నగోయా ప్రోటోకాల్ ప్రకారం జన్యు వనరుల సమాన పంపిణీకి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ ఘనత ప్రత్యక్ష నిదర్శనమని ఎన్‌బీఏ పేర్కొంది.